పరిగి: రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చిందని పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రంగాపూర్‌లోని రైతు వేదికలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు, మార్పులను రైతులు అవగతం చేసుకోవాలన్నారు. నానో యూరియా, నానో డీఏపీల ఉపయోగాలను తెలుసుకుని వాటి వినియోగాన్ని పెంచాలని సూచించారు. వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను సాగు చేయడంతో అధిక దిగుబడుల పాటు లాభాలను ఆర్జించవచ్చునని చెప్పారు. పంటల సాగు, చీడపురుగుల నివారణ చర్యల కోసం ప్రతీ రైతు కృషివాస్ యాప్ గురించి తెలుసుకోవాలని.. అందులో పూర్తి సమాచారం ఉంటుందన్నారు. ప్రభుత్వం రాయితీలపై వ్యవసాయ పరికరాలు, విత్తనాలను అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం, రైతు విజ్ఞాన కేంద్ర విశ్రాంత శాస్త్రవేత్త నర్సింహారెడ్డి, ఏడీఏ శంకర్‌రాథోడ్ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి


