● ఆలస్యంగా వెలుగులోకి
● వార్డెన్ తీరుపైకుటుంబ సభ్యుల ఆగ్రహం
దోమ: వసతి గృహంలో ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడెం మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన ప్యాట జంగయ్య కుమారుడు ప్రవీణ్ కుమార్(13) దోమ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. స్థానికంగా ఉంటున్న జంగయ్య చిన్నమ్మ కొమ్ముగాళ్ల చంద్రమ్మ సోమవారం పాఠశాలకు వెళ్లింది. బాలుడు కనిపించలేదు. దీంతో ఆమె తోటి విద్యార్థులను ఆరా తీయగా.. సరైన సమాధానం రాలేదు. విషయాన్ని బాలుడి తండ్రికి చెప్పింది. జంగయ్య వార్డెన్‌ను ఆరా తీయగా ఈ నెల 13వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. తెలిసిన వారి వద్ద, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 13 నుంచి బాలుడు కనిపించక పోయినప్పటికీ.. వార్డెన్ సమాచారం ఇవ్వక పోవడంతో బంధువులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


