అనంతగిరి: జన గణన సంక్షేమ పథకాల అమలు, దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జన గణన – 2027పై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జనగణనలో మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండు దశల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ మే 11న ప్రారంభమై జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో జన గణన ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ 2007 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా (కచ్చా, పక్కా, తదితర,) పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. అనంతరం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ప్లానింగ్ శాఖ జనాభా లెక్కల అధికారులు శ్రీకాంత్ నాయక్, వంగపండు గీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జన గణన, హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మాంగీలాల్, తాండూరు డీఆర్‌ఓ అనిత, ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
వేగవంతం చేయండి
జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల, ఇతర భవన నిర్మాణాల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, సీసీ రోడ్లు, ఎస్‌ఎస్‌జీ భవనాలు, పాఠశాలల ప్రహరీలుపై సమీక్ష చేశారు. వెంటనే పనులు పూర్తి చేసి నివేదిక పంపాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, డీపీఓ జయసుధ, హౌసింగ్ పీడీ సయ్యద్ మొక్రం బాబా తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచరాదని, సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు 119 దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆయా శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వారంలోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోజువారి కార్యక్రమాలపై తప్పనిసరిగా ఫొటోలు పంపించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.


