కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ప్యానల్స్ అమర్చడానికి కృషి చేస్తున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం కొడంగల్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన లబ్ధిదారుల ఇళ్లపై బిగించిన సోలార్ ప్యానల్స్‌ను పరిశీలించారు. వాటి పని తీరును గమనించారు. అనంతరం వినియోగదారులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 34 గ్రామాల్లో సుమారు 3వేల ఇళ్లకు సోలార్ ప్యానల్స్ బిగించినట్లు తెలిపారు. త్వరలో మిగతా గ్రామాలకు విస్తరించనున్నట్లు వివరించారు. వినియోగదారులు వాడుకున్నాక మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మిగులు విద్యుత్ ద్వారా లబ్ధిదారులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా మోడల్ సోలార్ విలేజ్ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇళ్లు, వ్యవసాయ రంగానికి ఈ పథకం అమలు చేయనున్నట్లు వివరించారు. ఇళ్లకు 240 యూనిట్లు, వ్యవసాయ రంగానికి 7.5 కిలోవాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా ప్యానల్స్‌ను బిగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఈ బాలస్వామి, ఎస్‌ఈ రవిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ట్రాన్స్‌కో డీఈఈ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం దౌల్తాబాద్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ నిర్వహణను పరిశీలించారు.


