కొడంగల్: పట్టణంలో కొలువుదీరిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బాలాలయంలో సోమవారం తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని వజ్ర వైడూర్యలు, పూలమాలలతో అలంకరించి తిరుచ్చి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం స్వామివారు చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


