గూడుకట్టు శుభవేళ | - | Sakshi
Sakshi News home page

గూడుకట్టు శుభవేళ

Mar 16 2026 8:59 AM | Updated on Mar 16 2026 8:59 AM

వికారాబాద్‌: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగియగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఆరు నెలలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. రేషన్‌ కార్డుల మంజూరు, ఉచిత విద్యుత్‌, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ తదితర వాటిపై దృష్టి సారించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. అయితే హౌసింగ్‌ శాఖలో ఇంజనీర్ల కొరత కారణంగా కొంత మేర ఇబ్బందులు ఎదురవుతున్నా అధిగమించి పథకాన్ని వేగవంతం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి కాగానే బిల్లులు అందేలా చొరవ చూపుతున్నారు.

వివిధ దశల్లో..

జిల్లాకు మొదటి విడతలో 2,345, రెండో విడతలో 10,518 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్‌ కూడా అందజేశారు. 8,536 ఇళ్లకు మార్కింగ్‌ ఇచ్చారు. 2,569 మంది బేస్మెట్‌ పనులు పూర్తి చేయగా ఒక్కొక్కరికి రూ.ఒక్కో లక్ష చొప్పున అందజేశారు. మరో 1,332 మంది రూప్‌ లెవెల్‌ వరకు పనులు పూర్తి చేశారు. 2,711 మంది రూప్‌ కాస్ట్‌ లెవెల్‌ వరకు పూర్తి చేయడంతో రూ.4 లక్షల చొప్పున బిల్లులు మంజూరు చేశారు. 286 ఇళ్లు పూర్తికాగా రూ.5 లక్షల చొప్పున జమ చేశారు. ఆయా స్థాయిల్లో ఉన్న 6,898 ఇళ్లకు రూ.143.45 కోట్లు చెల్లించారు. 4,327 మంది ఇళ్ల పనులు ప్రారంభించలేదు.

అయోమయంలో మరి కొందరు

రెండు విడతల్లోనూ స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. స్థలం లేని వారి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని స్థలం లేని పేదలు కోరుతున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లాకు 5,740 డబుల్‌ ఇళ్లు అప్పటి మంజూరయ్యాయి. 2016లో నిర్మాణ పనులను ప్రారంభించారు. 2,257 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 1,031 పూర్తయ్యాయి. ధారూరులో 120, మర్పల్లిలో 120, యాలాల్‌ మండలం కోకట్‌లో 180, తాండూరు పట్టణంలో 401, పరిగిలో 180, చౌడాపూర్‌ మండలం అడవి వెంకటాపూర్‌లో 30 ఇళ్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జిల్లాకు రెండు విడతల్లో మంజూరైన ఇళ్లు 13,464

ప్రొసీడింగ్స్‌ పొందిన లబ్ధిదారులు 12,863

నిర్మాణ దశలో 8,536

ఇంకా ప్రారంభం కానివి 4,327

గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నవి 286

చెల్లించిన మొత్తం రూ.143.45 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement