కేంద్ర మంత్రిని కోరిన స్టోన్ అసోసియేషన్ ప్రతినిధులు
తాండూరు: నాపరాతి పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల జాబితాలో చేర్చడంతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని తాండూరు క్వారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి విన్నవించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూ.రమేశ్‌కుమార్‌తో కలిసి తాండూరు క్వారీ ఓనర్స్ అసోసియేషన్, స్టోన్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో ఉన్న నాపరాతి పరిశ్రమ లైమ్ స్టోన్ స్లాబ్ చిన్నతరహా పరిశ్రమ జాబితాలో కొనసాగుతూ వచ్చిందన్నారు. ఇటీవల కేంద్రం భారీ పరిశ్రమల జాబితాలోకి చేర్చారని తెలిపారు. దీంతో లైమ్ స్టోన్, షాబాద్ స్టోన్, నాపా స్లాబ్ క్వారీ లీజ్ హోల్డర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 30 వేల కుటుంబాలు నాపరాతి పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయన్నారు. గుంటలు, అర ఎకరం నాపరాతి నిక్షేపాలు కలిగిన పట్టా భూముల్లో క్వారీ నిర్వహిస్తారని చెప్పారు. అందుకే నాపరాతి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమల జాబితాలో కొనసాగించాలని అభ్యర్థించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. తాండూరు నాపరాతి పరిశ్రమకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఓం ప్రకాష్‌సోమాని, మహ్మద్ అన్వర్, జైనుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.


