లక్ష్యం.. ఆరోగ్యకరమైన సమాజం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. ఆరోగ్యకరమైన సమాజం

Mar 13 2026 9:07 AM | Updated on Mar 13 2026 9:07 AM

దుద్యాల్‌: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్వేయంగా.. ప్రజా ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్‌ మిషన్‌– 100 పేరిట వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్‌ 12 వరకు వైద్య సేవలు కొనసాగించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సేవలను వంద రోజుల్లో నాలుగు దశల్లో అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.

ఈ నెల 31 వరకు..

మొదటి దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్‌, గైనకాలజీ, పిడియాట్రిక్‌, కంటి, ఎముకలు, దంతవైద్య నిపుణులు సేవలు అందించనున్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో వృద్ధాప్య చికిత్స శిబిరాలు, స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కంటి పరీక్షలు, పోషకాహరంపై అవగాహన, వ్యాధి నిరోధక టీకాల తనిఖీలు చేపడతారు.

ఏప్రిల్‌ 1– 15..

ఈ దశలో బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయితే చికిత్సకు రెఫర్‌ చేస్తారు.

ఏప్రిల్‌ 16– మే 15..

మూడో దశలో వేసవిలో వడదెబ్బ, అతిసారం వంటి సమస్యలపై దృష్టి సారిస్తారు. టీబీ(క్షయ) కేసులు గుర్తించడం, పోషకాహారం అందించడం, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడతారు. దీంతో పాటు అనుమానం ఉన్నవారికి డెంగీ, చికున్‌గున్యా, మలేరియా తదితర వ్యాధుల పరీక్షలు నిర్వహిస్తారు. రోగ నిర్ధారణ అయితే తగిన చికిత్స అందిస్తారు.

మే 16– జూన్‌ 12..

చివరి దశలో పట్టణ, పల్లె, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి, తగిన వైద్య చికిత్స అందజేస్తారు. ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. అలాగే ఆర్‌బీఎస్‌కే వారితో కలిసి సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థులకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందజేస్తారు.

నాలుగు దశల్లో హెల్త్‌ మిషన్‌– 100

జూన్‌ 12 వరకు వైద్య సేవలు

పీహెచ్‌సీ, కేజీబీవీ, వసతిగృహాల్లో శిబిరాల ఏర్పాటు

విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు

అన్ని రకాల వైద్య సేవలు

హెల్త్‌ మిషన్‌ కోసం సిబ్బందికి అవగాహన కల్పించాం. ఎప్పుడు ఏ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారో ఆశల ద్వారా తెలియజేస్తాం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందజేస్తాం.

– డాక్టర్‌ రవీందర్‌ యాదవ్‌,

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement