అంకితభావంతో పని చేయండి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పని చేయండి

Mar 12 2026 9:12 AM | Updated on Mar 12 2026 9:12 AM

తాండూరు టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఐసీయూ, డయాలసిస్‌ సెంటర్‌, జనరల్‌ వార్డులు, ల్యాబొరేటరీ, మహిళా వార్డును పరిశీలించారు. వైద్య సేవలు, భోజన వసతి, మౌలిక సదుపాయాలపై రోగులను, వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్‌ సదుపాయం, సిటి స్కాన్‌ తదితరాల అందుబాటుపై డీసీహెచ్‌ డాక్టర్‌ ఆనంద్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మూర్తి, డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ను అడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు విధుల పట్ల అంకితభావంతో ఉండాలన్నారు. అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య పరిరక్షణపై సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు. భవన మరమ్మతులను త్వరలోనే పూర్తి చేయిస్తానన్నారు. మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షేమానికే ప్రత్యేక కార్యక్రమం

తాండూరు రూరల్‌: సమస్యలు లేని గ్రామాలే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లక్ష్యమని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం తాండూరు మండలం గౌతాపూర్‌, చెంగోల్‌ గ్రామాల్లో ఆయన పర్యటించారు. గౌతాపూర్‌ జీపీలో సర్పంచ్‌ సుజన ఆధ్వర్యంలో స్థానికులతో సమావేశం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత ఉండరాదని తహసీల్దార్లు, ఎంపీడీఓలకు సూచించారు. ఆన్‌లైన్‌ విధానంలో ఇసుక పర్మిషన్లు ఇస్తామన్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో సమస్య ఎదురైతే తహసీల్దార్‌ కార్యాలయం నుంచి మ్యాన్‌వల్‌ పద్ధతిలో పర్మిషన్లు పొందవచ్చని తెలిపారు. ఇసుక అక్రమ రవాణను సహించేది లేదన్నారు.

టీచర్‌గా మారి..

గౌతాపూర్‌ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు రావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చెంగోల్‌ గ్రామంలో పర్యటించారు. రైతుబంధు నిధులు విడుదల చేయాలని పలువురు కోరారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సమ్మ, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, తహసీల్దార్‌ తారాసింగ్‌, ఎంపీడీఓ విశ్వప్రసాద్‌, ఎంఈఓ వెంకటయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నాగప్ప, పంచాయతీ కార్యదర్శులు ఫక్రోజీ, అశోక్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలి

అత్యవసర విభాగ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement