ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం | - | Sakshi
Sakshi News home page

ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం

Mar 12 2026 9:12 AM | Updated on Mar 12 2026 9:12 AM

ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం నేడు ధారూరుకుస్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక 14న హిందూ సమ్మేళనం ‘ధరణి’ తప్పిదాలను సరిచేయాలి రేపు ఆలయ భూముల కౌలు వేలం

తాండూరు టౌన్‌: తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని రామమందిర పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి బుధవారం రూ.లక్ష విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం, 27న శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరుకావాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.

ధారూరు: మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ పాల్గొంటారని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌ తెలిపారు. నాగ్‌సాన్‌పల్లిలో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని, ధారూరు బస్టాండు వద్ద సీసీ రోడ్డును ప్రారంభిస్తారని తెలిపారు. ధారూరు రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు.

తాండూరు టౌన్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తాండూరులో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. పట్టణంలోని అయ్యప్ప నగర్‌ అయ్యప్ప దేవాలయం వద్ద ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ఉంటుందని ఉత్సవ సమితి, అయ్యప్ప బస్తీ అధ్యక్షుడు భాస్కర్‌ హక్కే బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేసరవల్లి శ్రీ భువనేశ్వర పీఠాధిపతి కమలానంద భారతి స్వామి, ప్రధాన వక్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత కార్యకారిణి అన్నదానం సుబ్రహ్మణ్యం పాల్గొంటారన్నారు. కావున హిందూ బంధువులందరూ తప్పకుండా హాజరుకావాలని వారు కోరారు.

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు

కుల్కచర్ల: ధరణి తప్పిదాలను సరిచేయాలని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు కోరారు. బుధవారం ముజాహిద్‌పూర్‌కు చెందిన పలువురు రైతులతో కలిసి అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళిత సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రైతుల ఇనాం భూములను ధరణిలో మార్పులు చేర్పులు చేస్తున్న క్రమంలో ఆర్‌ఎస్‌ఆర్‌ (భూమి ఎక్కువగా చూపించడం)గా చేయడంతో అట్టి భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశ్వరి రెవెన్యూ సిబ్బందితో సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముజాహిద్‌పూర్‌ సర్పంచ్‌, నాయకులు, రైతులు చంద్రభూపాల్‌ రావు, భాస్కర్‌, యాదయ్య, శివ, అంబాదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మర్పల్లి: మండలంలోని సిరిపురం సంగమేశ్వర(మార్కండేయ) స్వామి ఆలయ భూములకు ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు కౌలు వేలం నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా మండల ఇన్‌చార్జ్‌(కార్యనిర్వాహక) అధికారి శాంతికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సర్వే నంబర్లలోని 17 నుంచి 29 ఎకరాల భూమిని రెండేళ్ల పాటు (2026 నుంచి 28) కౌలుకు ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాట దక్కించుకున్న రైతుల ఆధీనంలో 1 – 4 –2026 నుంచి 31 –03 –28 వరకు భూములు ఉంటాయన్నారు. రూ.5 వేలు డిపాజిట్‌ చేసి వేలంలో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. కౌలు దక్కని వారికి డిపాజిట్‌ తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు వేలంలో పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement