యాలాల: నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలకు నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధి రాస్నం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ– 2 విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మక్త శశికళ(34), తల్లి అంజిలమ్మకు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయింది. స్లాబ్ లెవెల్ వరకు పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో గోడలకు చేసిన ప్లాస్టరింగ్ పనులకు రోజు నీటిని పడుతున్నారు. నీటిని పట్టేందుకు ఒక డ్రమ్ములో నీటిని నింపి, సింగిల్ ఫేజ్ మోటారును డ్రమ్ముపై బిగించి గోడలకు నీళ్లు చల్లుతుంటారు. రోజులాగే ఆమె ఆదివారం సాయంత్రం నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శవానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి భర్త మంజునాథ్, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


