యాలాల: రెండు దశాబ్దాలుగా అరకొర వేతనాలతో విధులు నిర్వహిస్తున్న కేజీబీవీ ఉద్యోగులకు కనీస మూలవేతనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యాలాల కేజీబీవీ ఎస్‌ఓ మంగమ్మ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం భోజన విరామ సమయంలో కేజీబీవీ ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఓ మాట్లాడుతూ.. కేజీబీవీ, సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. నిరసన కార్యక్రమంలో కేజీబీవీ సీఆర్టీలు, సిబ్బంది ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
కుల్కచర్ల: కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి అజ్మత్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనికి తగ్గ వేతనం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, కోశాధికారి మల్లేశ్, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గాంగ్యనాయక్, సంఘ నాయకులు చందర్, ప్రసాద్, మహిపాల్, కేశవులు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
● కేజీబీవీ ఎస్‌ఓ మంగమ్మ
● భోజన విరామ సమయంలో
ఉద్యోగులతో కలిసి నిరసన


