కలెక్టరేట్‌లో వైద్య శిబిరం
● సమాజాభివృద్ధిలో వారిదే కీలక పాత్ర
● కలెక్టర్ దీపక్ తివారి
● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అనంతగిరి: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్నారని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళల గౌరవం, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. లింగ వివక్షత పూర్తి స్థాయిలో రూపుమాపాలన్నారు. మన ఇంటి నుంచే మార్పు ప్రారంభం కావాలన్నారు. ఆడ, మగ పిల్లలను సమానంగా చూడాలన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం, సమాన అవకాశాలు లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, డీఎంహెచ్‌ఓ స్వర్ణ కుమారి, డీఈఓ రేణుకాదేవి, డీపీఆర్‌ఓ చెన్నమ్మ, మెప్మా పీడీ రవికుమార్ జిల్లా హార్టీకల్చర్ ఆఫీసర్ సత్తార్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అర్థ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందాలి
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన, తక్షణ వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణ పరిధిలోని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల సమయపాలనపై ఆరా తీశారు. రోజూ ఎంతమంది పేషెంట్లు, గర్భిణులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం రికార్డులు, మందుల స్టాక్‌ను పరిశీలించారు. ఆ తర్వాత సఖి కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ స్వర్ణ కుమారి, వైద్యులు సౌమ్య, రజని తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. పలువురు రక్తదానం చేశారు. కలెక్టర్ దీపక్ తివారి శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, జిల్లా శిశు సంక్షేమాధికారి జ్యోత్స్న, జిల్లా క్రీడల శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు.


