● పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి
కొడంగల్ రూరల్: విద్యార్థులు లక్ష్యం దిశగా చదువుతూ ఉన్నత స్థానాల్లో నిలవాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ బాలాజీ కేజీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు అందించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, సమయాన్ని వృథా చేసుకోరాదని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తూ పాఠశాల పేరు నిలబెట్టాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, హెచ్‌ఎం వెంకటప్ప, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


