ఆసక్తిగా మారిన పరిణామాలు
ఇబ్రహీంపట్నం: ‘పట్నం’ మున్సిపల్ పీఠంపై చిక్కుముడి ఇంకా వీడడం లేదు. హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా అన్న చర్చ సర్వత్రా కొనసాగుతోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను గరిష్టంగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు గత మంగళవారం (3వ తేదీ) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. వారం రోజులు కావస్తున్నా ఎన్నిక వ్యవహారంపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలు కొలువుదీరినా ఇక్కడ మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ పీఠంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఎన్నికకు అడ్డంకిగా మారింది.
ఆకుల యాదగిరి తిరుగుబాటుతో రచ్చ
ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరుగ్గా 13న ఫలితాలు వెలువడ్డాయి. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో బీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఒక వార్డు నుంచి ఇండిపెండెంట్ గెలుపొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. 16న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగాల్సి ఉండగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగరి తిరుగుబాటుతో వ్యవహారం రచ్చరచ్చగా మారింది. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారానికి ఆకుల యాదగిరి హాజరుకాకపోవడం.. కిడ్నాప్ చేశారని వారి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడం.. వారికి మద్దతుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు జతకట్టడంతో ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడింది. తిరిగి 17న జరిగిన సమావేశానికి ఆకుల యాదగిరి హాజరైనప్పటికీ వారి కుటుంబసభ్యులు న్యాయస్థానానికి వెళ్లడం.. స్టే ఇవ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో ఎన్నిక మళ్లీ మొదటికే వచ్చింది.
కోర్టులు, ఫిర్యాదుల పర్వం
ఇక అక్కడి నుంచి వ్యవహారమంతా కోర్టులు, ఫిర్యాదుల పర్వంతో గడిచింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేశారని, మూడు పోలింగ్ కేంద్రాలల్లో ఓటు హక్కు ఉందని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు నీలం శ్వేత, బుగ్గరాములుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్యర్థులు, కాంట్రాక్టర్‌గా పనులు చేసుకుంటూ కాంగ్రెస్ కౌన్సిలర్‌గా గెలిచిన రాఘవేందర్‌రావు పదవికి అనర్హుడంటూ బీజేపీకి చెందిన ప్రత్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు.
నేనే చైర్మన్ అంటూ..
మరోవైపు తానే మున్సిపల్ చైర్మన్ అంటూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 17న జరిగిన సమావేశంలో తనను చైర్మన్‌గా మెజార్టీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారని, అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో కోర్టు స్టే ఇచ్చిందనే నెపంతో ఉద్దేశపూర్వకంగా రిటర్నింగ్ అధికారి పెండింగ్‌లో పెట్టారంటూ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలు రాకముందే ఎన్నిక జరిగినందున తననే చైర్మన్‌గా ప్రకటించాలని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కోర్టు తీర్పు ఏమొస్తుందో, ఎలా ఉంటుందో, ఎవరికి అనుకూలంగా వస్తుందోనని ఎదురుచూస్తున్న తరణంలో మూడు లేదా గరిష్టంగా నాలుగు వారాల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
ఉలుకూపలుకు లేదాయె..
కోర్టు ఆదేశాలు జారీ చేసి వారం సమీపిస్తున్నా ఎన్నికల అధికారుల నుంచి ఎలాంటి ఉలుకూపలుకు లేదు. అనిశ్చిత పరిస్థితులు అలాగే నెలకొన్నాయి. న్యాయస్థానం ఆదేశించింది కాబట్టి గడువులోపు తప్పక ఎన్నిక నిర్వహిస్తారనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు వివాదాలు, గొడవలు, గందరగోళ పరిస్థితులు అన్నీ సర్దుకుపోయి సాఫీగా ఎన్నిక ప్రక్రియ ముగుస్తుందా అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఇబ్రహీంపట్నం మున్సిపల్‌పై అదే ఉత్కంఠ
హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా..?
వారం గడిచినా ఎన్నిక నిర్వహణపై వెలువడని ప్రకటన
తప్పని ఎదురుతెన్నులు
ఎప్పటికి పూర్తవుతుందోననిసర్వత్రా చర్చ
మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని ఎప్పుటిలోగా ప్రకటిస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఏమేర తిప్పికొడుతుందోననే చర్చ నడుస్తోంది. పట్టణంలో ఏ నలుగురు కలిసినా మున్సిపల్ రాజకీయంపైనే ముచ్చటించుకుంటున్నారు. ఆకుల యాదగిరి మినహా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, వారికి మద్దతిస్తున్న ఒక బీజేపీ, మరో స్వతంత్ర కౌన్సిలర్లు ఇంకా క్యాంపుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపును వదిలి బయటకు వచ్చారు. ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటివరకు ఎన్నికపై నోరుమెదపలేదు. ఎప్పుడు ఎన్నిక జరుగుతుందో.. ఈ వ్యవహారం ఎప్పుడు ముగుస్తుందో వేచిచూడాల్సిందే.


