● ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపచేయాలని ఆర్టిజన్ కార్మికుల ఆందోళన
● హెచ్–82 యూనియన్ నాయకుడు జమీల్
అనంతగిరి: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికుల హక్కుల సాధనకు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్లు హెచ్–82 యూనియన్ నాయకులు జమీల్, జైపాల్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం వికారాబాద్‌లో ఆర్టిజన్ ఉద్యోగుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 23 వేల ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపచేయాలన్నారు. విద్యాఅర్హతలను బట్టి కన్వర్షన్ చేయాలన్నారు. కార్మికులందరికీ విద్యుత్ శాఖలో ఒకే విధమైన రూల్స్ ఉండాలన్నారు. ఈ విషయంలో యాజమాన్యానికి, ప్రభుత్వానికి పలుమార్లు నోటీసు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాధర్నాకు ఆర్టిజన్ కార్మికులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, వెంకటయ్య, సుభాన్, తేజ, శేఖర్, ఆలం తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనకు హాజరవ్వండి
కుల్కచర్ల: ఆర్టిజన్ కార్మికుల హక్కుల సాధనకు ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హెచ్82 యూనియన్ వికారాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శివని వెంకటయ్య తెలిపారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులందరికీ ఒకే విధమైన రూల్స్ ఉండాలని డిమాండ్ చేశారు. శ్రమదోపిడీకి పాల్పడుతూ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులపై నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీజీపీడీసీఎల్, సెక్రెటేరియెట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ఆందోలనకు ఆర్టిజన్ కార్మికులంతా హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు లక్ష్మయ్య, చంద్రకాంత్, చుక్కయ్య, శ్రీరాములు, యూసప్ తదితరులు పాల్గొన్నారు.


