తుర్కయంజాల్: మితి మీరిన వేగం, నిద్ర మత్తులో కారును డ్రైవింగ్ చేస్తుండటంతో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ రహదారిపై రాగన్నగూడలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 5 గంటలకు పాటిగూడకు వెళ్లే దారి వద్ద ఉన్న ఓ ఇనుప విద్యుత్ స్తంభాన్ని క్రెటా కారు నడుపుతున్న వ్యక్తి బలంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా స్తంభం కింద కూలి రోడ్డుపై పడింది. దీనికి ఉన్న తీగలు కూడా తెగిపోయాయి. వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సరఫరాను నిలిపివేశారు. నిత్యం రద్దీతో ఉండే సాగర్ రహదారిపై తెల్లవారుజామున జన సంచారం తక్కువగా ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పినట్‌లైంది. కారును నడుపుతున్న వ్యక్తి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు.


