వీడని చిక్కుముడి
● క్యాంపులో కొలిక్కిరాని చర్చలు
● శంకర్‌పల్లి చైర్మన్ పీఠం ఎవరికో..
● నేడు సీల్డ్ కవర్‌లో రానున్న పేరు
శంకర్‌పల్లి: అధికార పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠంపై చిక్కుముడి వీడడం లేదు. రెండు రోజుల నుంచి శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో క్యాంపు ఏర్పాటు చేసి, మంత్రి, చీఫ్ విప్, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, ఇన్‌చార్జిలతో చర్చలు సాగించినా ఎటూ ముందుకు వెళ్లడం లేదని తెలిసింది. అధికార, ప్రతిపక్ష, స్వతంత్రులంతా ఒక్కతాటిపై ఉన్న స్పష్టత రాకపోవడం కొసమెరుపు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులకు విప్ జారీ చేసి, తుది నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేస్తూ తీర్మానం చేశారు. సీల్డ్ కవర్‌లో వచ్చిన పేరుకే మద్దతు పలకాలని చెప్పారు.
సీల్డ్‌కవర్‌లో చైర్మన్ పేరు
మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్ ముందు నుంచీ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దండు రాజేశ్వర్ తాజాగా పోటీలోకి వచ్చారు. రెండు రోజుల నుంచి చర్చలు సాగినా తుది దశకు రాలేదు. ఆదివారం మధ్యాహ్నం మంత్రి శ్రీధర్‌బాబు, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో రేసులో ఉన్న ఇద్దరితో సమావేశం అయ్యారు. ఇద్దరు అభ్యర్థులు తమకే కావాలని భీష్ముంచుకొని కూర్చోవడంతో తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేసినట్టు సమాచారం. సోమవారం చైర్మన్ ఎన్నిక ఉండడంతో కాంగ్రెస్ సభ్యులందరికీ పార్టీ విప్ జారీ చేసి, ఉదయం మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
పార్టీలో వర్గపోరు
చైర్మన్ పీఠం తమ వర్గం వారికే కావాలంటూ ఒకవైపు ఎమ్మెల్యే యాదయ్య, మరోవైపు మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదివారం జరిగిన చర్చల్లో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. దీనిపై మంత్రి, డీసీసీ అధ్యక్షుడు కల్పించుకొని సముదాయించారు. తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలేసినట్లు తెలిసింది. దీంతో సోమవారం జరిగే చైర్మన్ ఎన్నికపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా వైస్ చైర్‌పర్సన్‌గా 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బైసోళ్ల సంధ్యారాణిని ఖరారు చేయనున్నట్లు సమాచారం.


