హ్యాట్రిక్ విజేత ఓటమి
తాండూరు: వరుసగా మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచి, హ్యాట్రిక్ సాధించిన బొబ్బిలి శోభారాణి శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 15వ వార్డు అంబేడ్కర్ నగర్ నుంచి ఏకధాటిగా 15 ఏళ్ల పాటు కౌన్సిలర్‌గా కొనసాగిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి దివిటి ఎల్లప్ప చేతిలో ఓటమి చవి చూశారు. ఈవార్డు నుంచి శోభారాణితో పాటు మైనార్టీ నాయకుడు బషరత్ బీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. బీఫామ్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నిలిచారు. కౌంటింగ్‌లో శోభారాణికి 314 ఓట్లు రాగా, బషరత్‌కు 559 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి పోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఎలప్ప 582 ఓట్లు సాధించి, విజయకేతనం ఎగరేశారు.
తాళం వేసిన
ఇంట్లో చోరీ
పరిగి: పట్టణ పరిధిలోని కిష్టమ్మగుళ్ల తండాలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సోమ్లనాయక్ ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లాడు. గుర్తు తెలియనిదొంగలు తాళం పగులగొట్టి బీరువాలోని నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన సోమ్లనాయక్ దొంగతనం జరిగిన విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపారు.
యువకుడిపై దాడి
కుల్కచర్ల: ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరిన ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు దాడి చేసి గాయరిచారు. ఈ ఘటన కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండీడు మండలం కొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఘణాపూర్ గేటు వద్ద ఉన్న సమయంలో అంతారం గ్రామానికి చెందిన మనోజ్, విష్ణులు అతడితో గోడవ పడ్డారు. శ్రీకాంత్‌కు తీవ్రంగా గాయాలైయ్యాయి. ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరగా తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
గడ్డివాము దగ్ధం
కుల్కచర్ల: ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాల్వీడు గ్రామానికి చెందిన పాలెపల్లి రాములు ఇంటి వద్ద రెండు గడ్డివాములు వేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం గడ్డివాము అంటుకుంది. ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకలేదు. సుమారు రూ. 40వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు.
ట్రాక్టర్ బోల్తాపడి
డ్రైవర్ మృతి
యాచారం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన రావుల శ్రీశైలం (50) శనివారం సాయంత్రం ట్రాక్టర్‌తో మీరాఖాన్‌పేట సమీపంలోని ఓ క్రషర్ మిషన్ వద్దకుకంకర నింపుకోవడానికి వెళ్లాడు. ట్రాక్టర్‌లో కంకర నింపుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. తీవ్ర గాయాలైన శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు క్రషర్ మిషన్ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడికి భార్య జయమ్మ, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
హ్యాట్రిక్ విజేత ఓటమి


