ఫలితం కోసం.. ఉత్కంఠ
అనంతగిరి: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ నేటితో పరిసమాప్తం కానుంది. వారం పది రోజులుగా జిల్లాలోని నాలుగు పురపాలక పరిధి వార్డుల్లో జోరుగా ప్రచారం సాగింది. అనంతరం ఈ నెల 11న పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లో భద్రంగా దాగుంది. శుక్రవారం ఉదయం లెక్కింపు ప్రారంభం కానుండగా.. ఫలితాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. విజయం మాదేనంటూ.. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 7 గంటల నుంచి..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 7 గంటలకు చేపట్టినా.. లెక్కింపు మాత్రం 8 గంటలకు ప్రారంభయ్యే అవకాశం ఉంది. ఫలితాలు వచ్చేందుకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ప్రక్రియలో ఏదైనా ఆటంకం కలిగితే.. ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమయ్యే ఆస్కారం లేకపోలేదు.
3 విడతల్లో కౌంటింగ్
ఓట్ల లెక్కింపు మూడు విడతలుగా చేసి, ఫలితాలు వెల్లడించానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో విడతకు 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏ విడతలో ఏ వార్డు కౌంటింగ్ జరుగుతుందో ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి విడత: 2, 4, 7,10,13, 16, 19, 22, 25, 28, 31, 33. రెండో విడత: 3, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29, 32, 34. మూడో విడత: 6, 9, 12, 18, 21, 24, 27, 30.
ఎవరి ధీమా వారిదే
గెలుపోటములపై అభ్యర్థుల అంచనాలు
మధ్యాహ్నం 3 గంటల లోపు
లెక్కింపు పూర్తి
విజయం ఎవరిని వరించేనో
32 వార్డులకు.. 112 మంది
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధి 34 వార్డుల్లో 2 (1, 15 )ఏకగ్రీవం కాగా, 32 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నుంచి 112 మంది బరిలో నిలవగా.. అందులోంచి 32 మంది విజేతలు ఎవరో నేటి మధ్యాహ్నం వెలువడనుంది. కాగా లెక్కింపు విషయమై ఎన్నికల అధికారులు గురువారం కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, అభ్యర్థులకు గుర్తింపు కార్డు తదితర వాటిని సిద్ధం చేశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ ప్రక్రియను పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు. లెక్కింపు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. ఈయన వెంట మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి తదితరులు ఉన్నారు.


