శివాజీ విగ్రహం ఏర్పాటులో ఉద్రిక్తత
మహేశ్వరం: ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వివాదానికి కారణమైంది. మహేశ్వరం మండల కేంద్రంలో డా.బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో స్థానిక బీజేపీ నాయకులు వీధి లైట్లు, సీసీ కెమెరాలు బంద్ చేసి శివాజీ విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసేందుకు యత్నించారు. క్రైన్ సహాయంతో విగ్రహాన్ని దించుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని నాయకులకు చెప్పారు. అర్ధరాత్రి లైట్లు, సీసీ కెమెరాలు బంద్ చేసి విగ్రహం పెట్టడం సరికాదన్నారు. అప్పటికే విగ్రహం ఏర్పాటు చేయడంతో గురువారం ఉదయం విషయం తెలుసుకున్న దళిత సంఘాలు నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల పక్కన శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. తాము ఛత్రపతి శివాజీకి వ్యతిరేకం కాదని చెప్పారు. కాకపోతే వేరే అనువైన చోట పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం పక్కన శివాజీ ప్రతిమ ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని శివాజీ విగ్రహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం జరుగుతున్న శివగంగ రాజరాజేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాక గ్రామ పాలకవర్గం ఆమోదంతో శివాజీ విగ్రహానికి అనువైన చోటు నిర్ణయించనున్నారు. ఈలోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మహేశ్వరం జోన్ అడిషనల్ డీసీసీ సత్యనారాయణ, ఏసీపీలు జానకిరెడ్డి, రాజు, సీఐ వెంకటేశ్వర్లు భారీగా పోలీసులను మోహరించారు. విద్వేషాలు, హింసను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


