రేపు రథసప్తమి వేడుకలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ, చిన్న శేష, గరుడ, హనుమంత, కల్ప వృక్ష, సర్వ భూపాల, చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు. రథ సప్తమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని ధర్మకర్తలు కోరారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణ సీఐగా రఘు కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ పని చేసిన భీంకుమార్ నుంచి ఆయన చార్జి తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతానని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. అనంతర భీంకుమార్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
దుద్యాల్: మండలంలోని హకీంపేట్‌లో ఏర్పాటు కానున్న ఏటీసీ(అధునాతన సాంకేతిక కేంద్రం) శిక్షణ అధికారిగా కామర్థి కవితను నియమించినట్లు ప్రిన్సిపాల్ శ్యాంసుదర్ శుక్రవారం తెలిపారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కవిత స్వగ్రామం హకీంపేట్ కావడంతో ఇక్కడ విధులు నిర్వర్తించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
అనంతగిరి: తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం(2026–27) అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ బీ సత్యానందం తెలిపారు. శుక్రవారం వికారాబాద్‌లోని కళాశాల ఆవరణలో ముస్లిం ప్రతినిధులు, తల్లిదండ్రుల సమక్షంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తాండూరు టౌన్: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకునిగా విధులు నిర్వర్తిస్తున్న చెలిమల్ల కిషన్ మధ్యప్రదేశ్‌లోని శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రొఫెసర్ అరవింద్ కుమార్ నేతృత్వంలో ‘విజిల్ మోడ్ తరంగాల ప్రేరణతో భూమి మాగ్నెటోస్పియర్‌లో ఎలక్ట్రాన్ పిచ్ యాంగిల్ స్కాటరింగ్ సంక్లిష్టతల అధ్యయనం’ అనే అంశంపై పీహెచ్‌డీ పరిశోధన చేశారు. ఫైనల్ వైవా అనంతరం యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ పట్టా అందజేసింది. తమ కళాశాల అధ్యాపకుడు ఫిజిక్స్‌లో డాక్టరేట్ సాధించడం పట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ వసంత కుమారి, సూపరింటెండెంట్ ఎండీ సులేమాన్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ లక్ష్మణ్, అధ్యాపకులు ఎస్ మహేందర్ రెడ్డి, సంగమేశ్వర్, డాక్టర్ డీ నారాయణరావు అభినందనలు తెలిపారు.
రేపు రథసప్తమి వేడుకలు
రేపు రథసప్తమి వేడుకలు
రేపు రథసప్తమి వేడుకలు


