వారసులొస్తున్నారు..
వికారాబాద్‌లో రసవత్తర పోటీ ఖాయం కాంగ్రెస్ తరఫునస్పీకర్ కూతురు గడ్డం అనన్య ఆమెకు పోటీగాఏసీఆర్ కుమార్తె చంద్రప్రియ బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో మంతనాలు చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తే కారెక్కే యోచన వీరిద్దరి రంగ ప్రవేశంతో వేడెక్కుతున్న రాజకీయం
పుర రంగంలోకి ముఖ్య నేతల కూతుళ్లు
వికారాబాద్: పురు పోరులో ఇద్దరు ముఖ్య నేతల కూతుళ్లు రంగం ప్రవేశం చేస్తారనే ఊహాగానాలతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వికారాబాద్ రాజకీయం వేడెక్కుతోంది. వారం రోజుల క్రితం మున్సిపల్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవగా వికారాబాద్ చైర్‌పర్సన్ పీఠం ఎస్సీ మహళకు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ సామాజిక వర్గానికి పదవి కేటాయించడంతో పోటీ చప్పగా ఉంటుందని అందరూ భావించారు. అయితే అధికార కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూతురు గడ్డం అనన్యను చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. స్పీకర్ కూడా పార్టీ శ్రేణులకు సానుకూల సంకేతాలివ్వడంతో వారిలో ఉత్సాహం పెరిగింది. ఇక వికారాబాద్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవడం తమ పార్టీకి నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు. అయితే ఈమెకు పోటీగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ శ్రేణులు పట్టుబట్టడంతో ఆనంద్ అందుకు నిరాకరించినట్టు సమాచారం. దీంతో మరో నాయకుడు విజయ్‌కుమార్ సతీమణి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో ఉంటుందనే ప్రచారం జరిగింది.
తెరపైకి చంద్రప్రియ పేరు
మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేశారు. ఆయన ఇటీ వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఏసీఆర్ కూతురు చంద్రప్రియ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె బీఆర్‌ఎస్ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం చంద్రశేఖర్ ముందు కొందరు నేతలు ప్రస్తావించగా ఎవరి పార్టీ వారిది.. పోటీ చేస్తే తప్పేముంది అని చెప్పినట్టు సమాచారం. ఇలా ఇద్దరు ముఖ్య నేతల వారసులుగా వారి కూతుళ్లు ఒకే సారి పుర పోరులో రంగం ప్రవేశం చేస్తారనే ప్రచారంతో వికారాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రప్రియ బీఆర్‌ఎస్ తరఫున రంగంలోకి దింపే యోచనతో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఆనంద్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ ఇప్పటి వరకు ప్రత్యేక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా తండ్రుల తరఫున చాలా సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు వస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల నుంచి వీరి పోటీ ఖాయమైతే వికారాబాద్‌లో జనరల్ స్థానాలను మించి రసవత్తర పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
ఆనంద్ అంగీకరిస్తారా..?
మాజీ మంత్రి చంద్రశేఖర్ కూతురు చంద్రప్రియ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయడాన్ని ఆనంద్ అంగీకరిస్తారా..? లేదా అనే చర్చ జరుగుతోంది. ముందుగా స్థానిక నేతలందరూ ఆనంద్ సతీమణి చైర్‌పర్సన్ రేసులో ఉంటారని భావించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆనంద్ ఎక్కడా చెప్పకున్నా స్పీకర్ ప్రసాద్‌కుమార్ రంగంలోకి దిగే పరిస్థితిలో ఆనంద్ సతీమణి అయితేనే గట్టి పోటీ ఇవ్వగలదని బీఆర్‌ఎస్ శ్రేణులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం అధికార పార్టీ మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో చైర్ పర్సన్‌గా పోటీ చేసి ఓటమిపాలైతే పరువుపోతుందనే భావనతో ఆనంద్ తన సతీమణినిపోటీకి నిరాకరించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వాలంటే చంద్రప్రియ బీఆర్‌ఎస్ పార్టీ తరఫున బరిలో ఉంటే బాగుంటుందని ఆ పార్టీ శ్రేణులు అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని ఆనంద్‌తో చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన అంగీకరిస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. చంద్రప్రియ గెలుపొంది చైర్‌పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకుంటే భవిషత్తులో ఎమ్మెల్యే సీటుకు పోటీగా మారే అవకాశం లేకపోలేదని ఆనంద్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయన్ను హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరు రంగంలోకి వస్తే రసవత్తర పోరు ఖాయంగానే కనిపిస్తోంది.
వారసులొస్తున్నారు..
వారసులొస్తున్నారు..


