ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయండి
అనంతగిరి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసే వాహనాలను సీజ్ చేయడంతోపాటు జరిమానా విధించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. నదులు, వాగులు, చెరువులను నుంచి ఇసుక తరలించడం ద్వారా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. ఆన్‌లైన్‌లో పర్మిషన్లు పొందిన తరువాతే ఇసుక రవాణా జరగాలన్నారు. విస్తృత తనిఖీలు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తరవాతే ఇసుక తీసుకెళ్లాలని సూచించారు. లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పనుల్లో వేగం పెంచండి
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్లియర్ చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్లకు సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) రాజేశ్వరి, జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, గనుల శాఖ ఏడీ సత్యనారాయణ, రవాణా శాఖ జిల్లా అధికారి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సృజనాత్మకతను వెలికి తీయాలి
ఇంటర్ నెట్ సేవలను మంచి పనులకు ఉపయోగించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలోని రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్‌ఐఏ కార్యక్రమం ద్వారా సోహం అకాడమీ ఇప్పటి వరకు జిల్లాలో 15 పాఠశాలల్లో రోబోటిక్స్ వర్క్‌షాప్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. వాటిలోంచి 5 పాఠశాలలను ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ వినూత్న నమూనాలు ప్రదర్శించారు. కలెక్టర్ వాటిని పరిశీలించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకా దేవి, సోహం అకాడమీ వ్యవస్థాపకులు సహదేవ్ కొమరగిరి, గోపీ ఉడురు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. పరిగి పట్టణంలో మూడు రోజులుగా జరుగుతున్న సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలన, విధుల వివరాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామ సర్పంచ్ బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు మంచి చేస్తే పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలన్నారు. పరిశుభ్రత, తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో డీపీఓజయసుధ, ఎంపీడీఓలు హరిప్రియ, పంచాయతీ పాలక వర్గం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో సర్పంచ్‌ల
పాత్ర కీలకం


