టీచర్ల కొరత ఉంటే చెప్పరా?
డీఈఓ, ఎంఈఓలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆగ్రహం
బొంరాస్‌పేట: మండలంలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు రావడంతో గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పందించారు. డీఈఓ, ఎంఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత ఉంటే ఎందుకు నివేదించలేదని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ఎంఈఓ హరిలాల్‌కు సూచించారు. ఇదిలా ఉండగా పాఠశాలను బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు సందర్శించారు. సర్పంచ్ బాల్‌రాజుతో కలిసి ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. అనంతరం సర్పంచ్ మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తామన్నారు. అనంతరం కొడంగల్ కడా కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల కొరతను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు మణెమ్మ, ఏఏపీసీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జగతి ఫౌండేషన్ నుంచి ఇద్దరు వలంటీర్లు
ఉపాధ్యాయుల కొరత సమస్యను తాత్కాలికంగా పరిష్కరించేందుకు జగతి ఫౌండేషన్ ముందుకు వచ్చింది. గ్రామానికి చెందిన అమృతమ్మ, పద్మను వలంటీర్లను నియమించినట్లు ఎంఈఓ హరిలాల్ తెలిపారు. పాఠశాల కమిటీ, గ్రామస్తుల సూచన మేరకు ఈ విద్యాసంవత్పరం చివరి వరకు వీరు విధుల్లో ఉంటారని తెలిపారు.


