సాగు ప్రోత్సాహానికే సబ్సిడీలు
మోమిన్‌పేట: వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇస్తోందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్ తెలిపారు. గురువారం మండలంలోని కేసారం గ్రామ రైతు వేదికలో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద ఎంపికై న రైతులకు టమాటా, తేనెటీగల బాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమ కోసం అనేక రకాల సబ్సిడీలు అందిస్తున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆధిక దిగుబడులు సాధించాలన్నారు. పంట వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. తద్వార పంట నష్టం జరిగితే పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కూరగాయల పంటలు పడించే రైతుల కోసం వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న రైతులు సేంద్రియ ఎరువుల తయారీ, తేనెటీగల పెంపకం లాంటివి చేపట్టాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. అనంతరం మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు ఒక సారి ఆయిల్ పామ్ మొక్క నాటితే 30 సంవత్సరాల పాటు దిగుబడి పొందవచ్చని పేర్కొన్నారు. ఉచితంగా మొక్కలు, బిందు సేద్యం పరికరాలు, ఎరువులు, మూడు సంవత్సరాల పాటు సాగు ఖర్చులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కూరగాయలు పండించే రైతులకు ఉచితంగా టమాటా, వంకాయ, మిర్చి నారులు ఇస్తామని చెప్పారు. నారు కావాల్సిన రైతులు 20 రోజుల ముందు ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ మండల అధికారి అక్షితరెడ్డి, ఏఈఓ శ్రీనివాస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, సర్పంచులు కిష్టయ్య, లలిత, కార్యదర్శి రవి, క్లస్టరు రైతులు తదితరులు పాల్గొన్నారు.


