సర్వం.. సర్వే ప్రామాణికం
మున్సిపాలిటీల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. పురపాలిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ మాత్రం.. సర్వే ప్రామాణికంగా గెలుపు గుర్రాలనుబరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
పరిగి: మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పరిగి మున్సిపల్‌లో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన పార్టీలైనకాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చలు, పోటీకి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చిన వార్డుల్లో ఆశావహులను బుజ్జగించడం, వారిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో బీజీగా ఉన్నారు.
పట్టుదలగా..
పురపాలికలో 18 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా పోటాపోటీగా పోటీదారులు పార్టీల నుంచి బీఫామ్ పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దల ప్రసన్నంకోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. గడిచిన పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకుండా జరగగా.. ప్రస్తుత పుర పోరు పార్టీ గుర్తులతో జరగనున్న నేపథ్యంలో.. పట్టు సాధించేందుకు పట్టుదలతో ముందుకుసాగుతున్నారు.
నిఘా సర్వేల ఆధారంగా
మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు చొప్పున బరిలోకి దిగనున్నట్లు తెలియగా.. అభ్యర్థులను సర్వే ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం గత అనుభవంతో అధికార పార్టీకి దీటుగా గెలుపు గుర్రాలను ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. నోటిఫికేషన్ రావడమే ఆలస్యమన్నట్లుగా.. పోరులో తలపడేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కాగా.. అధికార పార్టీ సర్వేల ఆధారంగా.. ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్టులను అనుసరించి అభ్యర్థుల ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఆశావహులకు నిరాశే..
పరిగి చైర్మన్ పీఠం బీసీ మహిళాకు రిజర్వు కాగా.. వార్డుల వారీగా రిజర్వేషన్లను సైతం అధికారులు ప్రకటించారు. కొందరికి అనుకూలంగా రాక పోవడంతో నిరాశ చెందుతున్నప్పటికీ.. తమ అనుకూలంగా ఉండే వారికి మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. అనుకూలంగా ఉండి, టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న వారు లేకపోలేదు. దీనికి తోడు సర్వే, దాని ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడంతో ఒక్కో వార్డుకు ముగ్గురు ఉన్న చోట మరో ఇద్దరికి నిరాశే మిగలనుంది.
రెబల్‌గానైనా..
ప్రజల మద్దతు, ఆర్థికంగా బలంగా ఉన్న వారికి టికెట్లు దక్కని పరిస్థితుల్లో స్వతంత్రులుగా బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ పార్టీకి రెబల్ అభ్యర్థులు ఎక్కువ ఉంటే.. ఆ పార్టీకి నష్టం జరగనున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం.
పురపోరుకు సన్నద్ధమవుతున్న పార్టీలు
అభ్యర్థుల ఎంపికలో నేతల బిజీ
పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్
గత అనుభవంతో వ్యూహాత్మకంగా
వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్
తమదైన శైలిని అనుసరిస్తున్న బీజేపీ


