పదకొండు దాటినా పత్తాలేరు!
● సమయపాలన పాటించని అధికారులు
● కార్యాలయాల్లో
ఖాళీగా కుర్చీల దర్శనం
బొంరాస్‌పేట: ప్రభుత్వ అధికారుల్లో సమయపాలన కొరవడింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. రాకపోకలు సాగిస్తున్నారు!.. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వారివారి కార్యాలయాలకు వస్తున్న విషయం ‘సాక్షి’ విజిట్‌లో వెలుగు చూసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీఓ, ఎంఈఓ, తహసీల్దారు, వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో తదితర కార్యాలయాలను సందర్శించగా.. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు.. అధికారుల రాకకోసం పడిగాపులు కాశారు. అనంతరం తిరిగి వెళ్లిపోయారు.
పనుల నిమిత్తం పొరుగూరుకు
అధికారుల అలసత్వంపై ఆరా తీయగా తహసీల్దారు పద్మావతి ఓ కేసు విచారణ నిమిత్తం వెళ్లినట్లు తెలిసింది. ఎంఈఓ హరిలాల్‌ను వివరణ కోరగా.. గణతంత్ర దినోత్సవం వేడుకకు బహుమతుల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లానని చెప్పారు. ట్రాన్స్‌కో ఇన్‌చార్జి ఏఓ నాగరాజు నెలరోజుల క్రితం కుల్కచర్ల మండలానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నేటికీ ఎవరూ రాలేదని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఏఓ పోలప్ప ఫీల్డ్ పని నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లినట్లు సమాచారం. ఇన్‌చార్జి ఎంపీడీఓ వెంకన్‌గౌడ్, ఎంపీఓ తదితర సిబ్బంది మధ్యాహ్నం తర్వాత విధులకు హాజరయ్యారు.
పదకొండు దాటినా పత్తాలేరు!


