రైతు ముంగిట్లోకే శాస్త్రవేత్తలు
పరిగి: రైతుల ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలను పంపి సాగులో మెలకువలు నేర్పుతున్నామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్డస్ జానయ్య అన్నారు. బుధవారం పరిగి పట్టణంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యాలయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతోందన్నారు. అన్ని ప్రాంతాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. రసాయన ఎరువుల వాడకం ద్వారా ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయని, రైతులు సేంద్రియ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తెచ్చి రైతులకు మేలు చేసే 16 రకాల పథకాలను వెనక్కి నెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతులను అప్పుల భారం నుంచి బయటపడేశారని అన్నారు. మూడు జిల్లాల్లో వ్యయసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ.123 కోట్లు, వంద ఎకరాల భూమి, 183 మంది సిబ్బంది అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తేగా మంజూరు చేశారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాకే సబ్సిడీపై యంత్రాలు పంపిణీ చేస్తోందన్నారు. పరిగి పట్టణంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త వంగడాల సాగు కోసం పరిగి మండలంలో 30 ఎకరాల భూమి కేటాయిస్తామని తెలిపారు. అలాగే వసతుల కల్పనకు రూ.25 లక్షలు మంజూరు చెప్పారు. అనంతరం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం అధికారులు నరేందర్‌రెడ్డి, ఏకాత్రి, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
సేంద్రియ సాగుపై ఆసక్తి పెంచుకోవాలి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ జానయ్య
పరిగి పట్టణంలో రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యాలయం ప్రారంభం


