పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం
తాండూరు రూరల్: కమ్యూనిస్టు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కరన్‌కోట్ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ వద్ద సీసీఐ శాఖను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో, గ్రామాల్లో పార్టీ శాఖలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం సీసీఐ శాఖ సహాయ కార్యదర్శి శరణప్ప మాట్లాడుతూ.. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగవిరమణ పొందిన కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యంలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో కార్మికులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, నాయకులు అనంతయ్య, అశోక్, మదన్ పండిత్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్


