రేషన్ డీలర్‌పై విచారణ
యాలాల: మండల పరిధిలోని నాగసముందర్ రేషన్ డీలర్ పద్మమ్మపై సోమవారం ఆర్‌ఐ శివచరణ్ విచారణ చేపట్టారు. లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం తక్కువగా వేస్తున్నారని, నిలదీసిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఆర్‌ఐ విచారణ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు.
పాలిషింగ్ యూనిట్
యజమానికి రిమాండ్
తాండూరు రూరల్: వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన పాలిషింగ్ యూనిట్ యజమానిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని కరన్‌కోట్ పీఏస్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. యాలాల మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన సంగెం సంతోష్(36), జగ్గమ్మ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వీరు జీవనోపాధికోసం తాండూరుకు వలస వచ్చారు. మండల పరిధి కోటబాసుపల్లి గ్రామశివారులోని కుర్వ శ్రీనివాస్ పాలిషింగ్ యూనిట్లో పనికి కుదిరారు. ఈ నెల 16న యూనిట్లోని అద్దెగదిలో సంతోష్ ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి భార్య జంగమ్మ.. యూనిట్ యజమాని శ్రీనివాస్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఆయన చావును అతనే కారణమన్నారు. భర్తను చంపేస్తానని బెదిరిస్తూ.. తనను లైంగిక ఇబ్బందులకు గురిచేసేవాడని పేర్కొంటూ.. ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ రాథోడ్ వినోద్ తెలిపారు.
‘రేడియల్ రోడ్డు పనులను అడ్డుకుంటాం’
శంషాబాద్ రూరల్: రేడియల్ రోడ్డు పనులను అడ్డుకుని తీరుతామని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి హెచ్చరించారు. కొత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న రేడియల్ రోడ్డు–2 నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులతో సోమవారం మల్కారంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్–షాబాద్ రోడ్డు విస్తరణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినా జరగడం లేదన్నారు. పాత రోడ్డు అభివృద్ధికి నిధులు లేవంటున్నారని, అయితే కొత్త రోడ్డు నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పాత రోడ్డును రైతులకు అప్పగించి నూతన రోడ్డు వేసుకోవాలని సూచించారు. పెద్దల కోసం పేద రైతుల పొలాల మీదుగా రోడ్డు వేయడం అన్యాయమన్నారు. అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు.. కాని సొంత పనుల కోసమే అని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు మురళీధర్‌రెడ్డి, నాయకులు శంకర్‌రెడ్డి,ౖ రెతులు పాల్గొన్నారు.
ఏటీఎంలో చోరీకి యత్నం
కొందుర్గు: దుండగులు ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని లాల్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌పహాడ్ చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున దుండగులు ఇండియా–1 ఏటీఎం మిషన్ పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో శబ్దం విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి పారిపోయారు. ఏటీఎం మిషన్ స్క్రీన్ పగిలిపోయింది. దీనిపై సూపర్‌వైజర్ సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
ఇళ్ల నిర్మాణాల పరిశీలన
కేశంపేట: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు నాణ్యత పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని నిర్ధవెళ్లి సర్పంచ్ చెదురువెళ్లి భాస్కర్‌గౌడ్ అన్నారు. మండల పరిధిలోని నిర్ధవెళ్లిలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలను చేపట్టి, బిల్లులు పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి విజయ్‌కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.


