‘భూమి తీసుకుని బెదిరిస్తున్నారు’
శంకర్‌పల్లి: ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు అధినేత రాందేవ్‌రావు తమ భూములను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుని, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన బాధితులు సోమవారం సదరు పొలాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 305/2లో ఎరుకలి మల్లమ్మకు 1.20 ఎకరాలు, 305/3లో ఎరుకలి రామయ్యకు 2 ఎకరాలు, 306లో ఎరుకలి పెంటయ్యకు 1.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములను 2020లో ఐదేళ్ల కోసం రూ.32 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని పలుమార్లు రాందేవ్‌రావు వద్దకు వెళ్లగా బెదిరింపులకు పాల్పడున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మలమ్మ, నర్సింలు, యాదగిరి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
చట్టప్రకారం ముందుకెళ్తా..
ఈవిషయమై ఎక్స్‌పీరియం అధినేత రాందేవ్‌రావును వివరణ కోరగా.. 2020లో తాను భూమిని లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని, ఇందుకోసం 99 ఏళ్లకు గాను సదరు యజమానులకు రూ.13 లక్షలు ముందుగానే చెల్లించానని తెలిపారు. వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చట్టప్రకారం ముందుకు వెళ్తానని స్పష్టంచేశారు.


