వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ సర్వే పూర్తి
కొడంగల్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి ఫీల్డ్ సర్వే పూర్తయినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు) తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. వికారాబాద్ నుంచి కృష్ణా వరకు 130 కిలోమీటర్ల దూరం నూతన రైల్వే లైన్ వేయడానికి భూ సేకరణ చేయాల్సి ఉంది. నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా రైలు మార్గం వేయడానికి అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 130 కిలో మీటర్ల దూరం నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌కు సుమారు రూ.2,785 కోట్ల ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట శివారులో కొత్తగా రైల్వే స్టేషన్ల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. వికారాబాద్ నుంచి పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట, మద్దూరు, నారాయణపేట, మక్తల్, కృష్ణ జిల్లా వరకు కొత్త మార్గం వేయనున్నారు. 130 కిలోమీటర్ల దూరం పట్టాలు వేయడానికి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే క్షేత్ర స్థాయి సర్వే పూర్తయింది. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారు.
కొడంగల్ మీదుగా...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు కొడంగల్ మండలం టేకుల్‌కోడ్ దగ్గర నిర్మించనున్న సిమెంట్ ఫ్యాక్టరీ మీదుగా రైల్వే నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, మద్దూరు, నారాయణపేట మీదుగా కృష్ణ జిల్లా వరకు రైల్వే లైన్‌కు మార్గం సుగమమైంది.


