అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
● పైలెట్ రోహిత్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ ● డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్
తాండూరు: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన రోజే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి రాజకీయ జీవితం అంధకారమైందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్ విమర్శించారు. ఆదివారం ఆయన తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధారాసింగ్ జాదవ్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపారన్నారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. పైలెట్ రోహిత్‌రెడ్డి దౌర్జాన్యాలను తట్టుకోలేక అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ గెంటివేస్తే కాంగ్రెస్ అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రసాదించిందని గుర్తు చేశారు. నియోజకవర్గరంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 91 మంది, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 45 మంది విజయం సాధిస్తే 70 పంచాయతీల్లో గెలిచినట్లు ప్రకటించుకోవడం సిగ్గు చేటు అన్నారు. 11 మంది కాంగ్రెస్ రెబల్స్ పార్టీలోనే ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్లోళ్ల నర్సింలు, నాగప్ప, లొంక నర్సింలు, అప్పు, అనిల్ తదితరులున్నారు.


