ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
మోమిన్‌పేట్/అనంతగిరి: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. మోమిన్‌పేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తమకు ఉన్న అధికారాలను వినియోగించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ వాసుచంద్ర, నోడల్ అధికారి సదానందం, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సృజన తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌పై జాగ్రత్తలు తప్పనిసరి
బంట్వారం: అధికారులు సొంత నిర్ణయాలతో కాకుండా ఎన్నికల నిబంధనల మేరకు పని చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శనివారం ఆయన కోట్‌పల్లిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పఠిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఎంపీడీఓ హేమంత్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


