సందేహాలుంటే సంప్రదించాలి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్‌బాష, ప్రత్యేకాధికారి, డీఆర్‌ఓ మంగీలాల్ అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. మండలంలో 21 మంది ఆర్‌ఓలు, 182 మంది పీఓలు, 206మంది ఓపీఓలు ఉన్నారన్నారు. మండలాన్ని మొత్తం ఏడు రూట్లు, మూడు జోన్‌లుగా ఏర్పాటు చేశారన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలన్నారు. సందేహాలుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఉదయం ఆర్‌ఓలు, పీఓలు, ఓపీఓలు సెంటర్ వద్దకు చేరుకుని సామగ్రిని సరిచూసుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత తమకు కేటాయించిన గ్రామాలకు ప్రత్యేక బస్సుల్లో సామగ్రితో చేరుకున్నారు. సాయంత్రం పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీఓ దయానంద్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
144 సెక్షన్ అమలు
మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఉన్నందున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ భీంకుమార్ తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల అనంతరం ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు.
ధారూరులో 11 రూట్లు
ధారూరు: మండల పరిధిలో 29 పంచాయతీలకు ఆదివారం జరిగే ఎన్నికల ఏర్పాట్లను అధికారులు శనివారం పూర్తి చేశారు. తొలుత పంచాయతీల వారీగా విధులు నిర్వహించాల్సిన సిబ్బంది జాబితాను మైక్‌లో వినిపించారు. మధ్యాహ్నం బ్యాలెట్ పేపర్ల పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. మధ్యా హ్న భోజనం అనంతరం బ్యాలెట్ బాక్సులు, సామగ్రి సమకూర్చారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వీటిని పీఓలకు అందజేశారు. ప్రతీ గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రి, ప్యాకింగ్ సంచులను పంపిణీ చేశారు. పీఓలు తమకు కేటాయించిన సిబ్బందితో కలిసి బస్సుల్లో తరలివెళ్లారు. మండలాన్ని 11 రూట్లుగా చేసి 11 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
ఎలుకలు కొరికిన సామగ్రి
పోలింగ్ సెంటర్, వార్డునంబర్‌తో కూడిన స్టాంపును పంపిణీ చేయాల్సి ఉండగా స్టాంపులు లేకపోవడంతో అధికారులు మండిపడ్డారు. ఓటర్లు ఒక వార్డుకు బదులుగా మరో బాక్సులో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ వేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మొదటి విడత విధులు నిర్వహించామని, అక్కడ సరిగ్గా ఉన్నాయని, ఇక్కడ మాత్రం స్టాంపులపై ఉన్న అక్షరాలను తీసివేసి పంపిణీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎలుకలు కొరికిన సామగ్రిని పంపిణీ చేశారని పలువురు ఉద్యోగులు వాపోయారు.


