ఉన్నతాధికారుల తప్పిదం..
ఒకే అధికారికి రెండు చోట్ల ఎలక్షన్ డ్యూటీ ఒకచోట రిపోర్ట్.. మరోచోట గైర్హాజరు అయినా సస్పెన్షన్ వేటు ఇదే తరహాలోమరి కొందరిపై చర్యలు అయోమయంలో బాధిత ఉద్యోగులు
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారుల తప్పిదంతో సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒకే అధికారికి రెండు చోట్ల ఎలక్షన్ డ్యూటీ వేయడం.. ఒకచోట విధుల్లో చేరినా మరోచోట గైర్హాజరయ్యారనే కారణంతో వేటు వేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలకు ఉద్యోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలో ఉపాధి హామీ పథకం ఏపీఓగా పని చేస్తున్న శారదను స్థానిక జోనల్ ఆఫీసర్‌గా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారులు ఈమెకే దౌల్తాబాద్ పీఓగా డ్యూటీ వేశారు. శారద బషీరాబాద్‌లో ఎన్నికల విధుల్లో చేరారు. దౌల్తాబాద్‌లో విధులకు రాలేదనే కారణంతో ఆమె సస్పెండ్ చేశారు. ఇదే మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అయూబ్ పాషాను బషీరాబాద్ స్టేజ్ 2 ఆర్వోగా నియమించారు. ఇతనికే దౌల్తాబాద్ మండల పీఓగా బాధ్యతలు అప్పగించారు. బషీరాబాద్ ఎన్నికల డ్యూటీలో చేరడంతో అతన్ని కూడా సస్పెన్షన్ చేశారు. అతడి ఫోన్‌కు సస్పెన్షన్ ఆర్డర్ పంపారు. ఈ విషయాన్ని సదరు అధికారి సబ్‌కలెక్టర్ ఉమాశంకర దృష్టికి తీసుకెళ్లారు. తాను ఇక్కడ విధుల్లో ఉండగా దౌల్తాబాద్ పీఓగా అలాట్ చేశారని వివరించారు. అక్కడ రిపోర్టు చేయని కారణంగా సస్పెన్షన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ అధికారులు పలువురికి డ్యూటీలు వేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. ఒకే అధికారికి రెండు చోట్ల ఎన్నికల విధులు ఎలా వేస్తారని బాధిత ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అలాగే మండలానికి కేటాయించిన పీఓలు నసీమా రెహన, అన్నపూర్ణ, మానస విధులకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని ఎంపీడీఓ సంపత్‌కుమార్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల సిబ్బందికి శాపం


