జోరుగా ‘పంచాయతీ’ ప్రచారం
● మహిళలకు నిత్యం రూ. 300, పురుషులకు రూ.500 కూలీ
● మద్యంతో పాటు మాంసం భోజనం
యాచారం: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థులు ప్రజలను కలిసి తమకే ఓటు వెయ్యాలని వేడుకుంటున్నారు. నామినేషన్ల విత్‌డ్రాతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు మంగళవారం సాయంత్రం అధికారులు గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, పుట్‌బాల్ వంటివి కేటాయించగా, అదే వార్డు సభ్యులకు గౌను, గ్యాస్‌పొయ్యి, స్టూల్, సిలిండర్ లాంటివి ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ క్లస్టర్ కేంద్రాల్లో అధికారులు ఏ పోటీదారుడికి ఏ గుర్తు కేటాయించారో ముందస్తుగానే సమాచారం అందజేశారు. గుర్తుల కేటాయింపుతో అభ్యర్థుల ప్రచారం సామగ్రి కోసం నగరంలోని ప్రింటింగ్ ప్రెస్, ఇంటర్‌నెట్ కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఇక కేటాయించిన గుర్తులతో ప్రజల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రచార సామగ్రిని అధిక సంఖ్యలో తెచ్చేందుకు గాను పోటీ అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
కూలీలకు భలే డిమాండ్..
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూలీలకు భలే డిమాండ్ ఏర్పడింది. నిత్యం ఉదయం, సాయంత్రం ప్రజలను కలిసి గుర్తులపై గుర్తుండేలా ప్రచా రం నిర్వర్తించడానికి పోటీ అభ్యర్థులు కూలీలను ఉపయోగించుకుంటున్నారు. ర్యాలీలు కూడా తీస్తున్నారు. మహిళలకై తే నిత్యం రూ.300, అదే పురుషులకై తే రూ. 500 అందజేస్తున్నారు. పంచా యతీ ఎన్నికల సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. కూలీ లు లేక పత్తి తీత పనులు నిలిచిపోయాయి. పత్తి తీయకపోవడంతో చెట్లపైనే రూ. లక్షలాది విలువ జేసే పత్తి వృథావుతోంది. పత్తి తీత పనులతో పాటు మిగితా వ్యవసాయ పనులకు కూడా కూలీ లు వెళ్లడం లేదు. రైతులు వ్యవసాయ పనులకు రావాలని ప్రాదేయపడిన స్పందన వెళ్లడంలేదు.
మద్యం, మాంసం భోజనం..
ప్రచార హోరులో పాల్గొనేందుకు వెళ్లే కూలీలకు నిత్యం మద్యంతో పాటు మాసంతో కూడిన విందు భోజనం అందజేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న ప్రచారానికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మద్యం పంపిణీ చేస్తున్నారు. మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, మాల్, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, యాచారం తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా విందు భోజనం నిర్వహిస్తున్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు పంపిణీ చేసే డబ్బు కంటే నామినేషన్ వేసినప్పటి నుంచి విందు భోజనాలకు రూ. లక్షల్లో ఖర్చవుతోంది. మొండిగౌరెల్లి, మల్కీజ్‌గూడ, గునుగల్, మాల్, మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి తదితర గ్రామాల్లో పోటాపోటీగా అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.


