పునరాభివృద్ధి నత్తనడక! | - | Sakshi
Sakshi News home page

పునరాభివృద్ధి నత్తనడక!

Nov 9 2025 9:27 AM | Updated on Nov 9 2025 9:27 AM

పునరా

పునరాభివృద్ధి నత్తనడక!

మందగమనంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు

రెండేళ్లలో 46 శాతం మాత్రమే పూర్తి

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

పార్కింగ్‌, బుకింగ్‌, ఆర్పీఎఫ్‌, ఆర్‌యూబీ తదితర పనులు పూర్తి

రెండు వైపులా కొనసాగుతున్న స్టేషన్‌ భవనాల నిర్మాణం

సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనులు మందగమనంలో సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 46 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి మొత్తం వంద శాతం పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్‌ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎయిర్‌పోర్ట్‌ తరహాలో అభివృద్ధి చేసేందుకు 2022 నవంబర్‌లో శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గిర్దారీలాల్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రైల్వేశాఖ ఒప్పందం చేసుకుంది. సుమారు రూ.714 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రతిరోజూ సగటున 180 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 2 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. స్టేషన్‌ పునరాభివృద్ధి తరువాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే రైళ్ల సంఖ్య కూడా పెరుగనున్నట్లు అంచనా. స్టేషన్‌ పునరాభివృద్ధిలో భాగంగా ఉత్తర, దక్షిణ భాగాల్లో మూడంతస్థుల భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు తాత్కాలిక బుకింగ్‌ కార్యాలయం, ఆర్‌పీఎఫ్‌ భవనం. స్టేషన్‌కు తూర్పువైపు ఒక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ప్లాట్‌ఫారం షెల్టర్‌, పార్కింగ్‌ షెడ్‌ పనులను పూర్తి చేశారు.

అందంగా..ఆహ్లాదంగా...

నిజాంకాలంలో నిర్మించిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ హైదరాబాద్‌ మహానగరానికి ఒక అందమైన ఆభరణంగా అలంకృతం కానుంది. హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వివిధ రకాల పనుల వల్ల, సాంకేతిక సమస్యల వల్ల పనుల పురోగతిలో కొంత మందగమనం చోటుచేసుకున్నప్పటికీ వచ్చే ఏడాది నాటికి అద్భుతమైన భవనం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర వైపు జీ+3 అంతస్తులతో కొత్త ఐకానిక్‌ స్టేషన్‌ భవనం, దక్షిణ వైపు జీ+3 అంతస్తులతో మరో భవనం నిర్మిస్తున్నారు. అలాగే రెండంతస్తుల స్కై కాన్కోర్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఈ కాన్కోర్స్‌లో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు లభిస్తాయి. రిటైల్‌ షాపులు, కేఫెటేరియాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర వైపు మల్టీ–లెవల్‌ పార్కింగ్‌, దక్షిణ వైపు అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉత్తర, దక్షిణ భవనాల వద్ద రెండు వైపులా 7.5 మీటర్ల వాక్‌వేలు, రెండు ట్రావెలేటర్లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌లో మొత్తం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు వినియోగంలోకి రానున్నాయి. ట్రావెలేటర్లు, స్కైవాక్‌లతో కూడిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. మొత్తం 7255 చదరపు మీటర్ల విస్తీర్ణం అందుబాటులోకి రానుంది. అలాగే ఉత్తరం వైపు వాక్‌వే ద్వారా, తూర్పు,పశ్చిమ రూట్‌లలో స్కైవాక్‌ ద్వారా మెట్రోస్టేషన్‌లకు అనుసంధానాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ పురోగతి..

దక్షిణం వైపు బేస్‌మెంట్‌ నిర్మాణం దాదాపు 95 శాతం పూర్తయింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ రోడ్లు, డ్రైన్లు, ఇతర సివిల్‌ పనులు మొత్తం పూర్తిచేశారు. బేస్‌మెంట్‌–2లో 200 కార్లు నిలిపేందుకు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

ప్లాట్‌ఫారమ్‌ 10 వైపు 2031 చ.మీ.పార్కింగ్‌ సదుపాయాన్ని అభివృద్ధి చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు సదుపాయం ఉంటుంది.

దక్షిణ భవనం విస్తరణ పనులు 55 శాతం పూర్తయ్యాయి.స్లాబ్‌ షట్టరింగ్‌ కొనసాగుతోంది.

ఉత్తరం వైపు గణేష్‌ ఆలయం సమీపంలో మల్టీ–లెవల్‌ కార్‌ పార్కింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. జీ+4 అంతస్తులతో చేపట్టిన ఈ పార్కింగ్‌లో 400 కార్ల సామర్థ్యం ఉంటుంది.ఇప్పటి వరకు 95 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

ఉత్తరం వైపు ప్రధానభవనం పనులు కొనసాగుతున్నాయి.

మెట్రో కనెక్టివిటీ కోసం స్కైవాక్‌ కోసం డ్రాయింగులను ఆమోదించారు. ఉత్తర భవనం సమీపంలో ఫౌండేషన్‌ పనులు ప్రారంభించారు.

మొత్తం పనుల పురోగతి సుమారు 46 శాతానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

పునరాభివృద్ధి నత్తనడక!1
1/1

పునరాభివృద్ధి నత్తనడక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement