యాచన వీడేలా.. యాతన తీరేలా!
సర్వే చేయిస్తున్నాం
షాద్‌నగర్: యాచకుల జీవనస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఖాళీ కడుపులతో వీధుల్లో తిరుగుతూ ఆకలి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి, యాచకత్వాన్ని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని తదనుగుణంగా సౌకర్యాలు కల్పించి అండగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా యాచకుల వివరాలను మెప్మా సిబ్బంది సేకరిస్తున్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశల మేరకు..
జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో చాలా మంది నిరుపేదలు భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు నిత్యం రోడ్లపై కనిపిస్తున్నారు. వారిని గుర్తించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నుంచి ఆదేశాలు జారీ కావడంలో మున్సిపల్ అధికారులు స్పందించారు. మెప్మా సిబ్బంది పట్టణాల్లో తిరుగుతూ యాచకులు ఉండే ప్రాంతాలను గుర్తించి వారి వివరాలు సేకరిస్తున్నారు. పేరు, ఊరు, కులం, గుర్తింపు కార్డు ఉందా, కుటుంబ సభ్యులు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఎంత కాలంగా భిక్షాటన చేస్తున్నారు, కారణాలు, కుటుంబంలో ఎంత మంది భిక్షాటన చేస్తున్నారు, ఎంత వస్తుంది. వచ్చిన డబ్బులు ఏం చేస్తారు, బ్యాంకు ఖాతా ఉందా, లేకపోతే డబ్బులు ఎక్కడ ఆదా చేస్తారు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఏమైనా చదువుకున్నారా, ఏదైనా సమస్య వస్తే సాయం కోసం ఎవరిని ఆశ్రయిస్తున్నారు, చదువుపై ఆసక్తి ఉందా, నైపుణ్య శిక్ష ణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారా, ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారువివరాలు సేకరిస్తున్నారు.
ఆరోగ్య సంరక్షణకు చర్యలు
యాచకుల ఆకలి తీర్చేలా ప్రభుత్వం వారికి భరోసా కల్పించనుంది. కొందరు అనారోగ్యంతో ఏ ఆదరణ లేక అనాథలుగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో విగత జీవులుగా మారుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపట్టనుంది.
పిల్లలకు చదువు నేర్పించేందుకు..
భిక్షాటన చేసి జీవనం సాగించే వారి పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతోంది. విద్యకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల వెంట రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి చిన్నారులకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. చిన్నారులను గుర్తించి వారికి చదువు చెప్పించనున్నారు. ఇళ్లు లేని వారెందరు ఉన్నారో గుర్తిస్తున్నారు. అవసరమైతే వీరికి పట్టణాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
పునరావాస సౌకర్యాలు
● సర్వేలో గుర్తించిన యాచకుల వివరాలతో పాటు వారిని మ్యాపింగ్ చేయడం.
● భిక్షాటన చేసే వారికి భవిష్యత్‌లో పునరావాస సౌకర్యాలు కల్పించడం.
● ఆరోగ్య సమస్యలు గుర్తించి చికిత్స అందేలా వివరాలు సేకరించడం.
● 6–14 ఏళ్లలోపు బాలలు భిక్షాటన చేస్తున్నట్లు తేలితే తప్పనిసరిగా విద్యను అందించడం.
● రోడ్ల మీద యాచించకుండా స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, ప్రైవేటు సెక్టార్‌లో నడిచే సంస్థల్లో చేర్పించడం.
● యాచకులకు అవగాహన కల్పిస్తూ భిక్షాటన చేయకుండా ఉపాధి, ఆర్థిక అవసరాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం.
యాచకత్వ నిర్మూలనకు ప్రభుత్వాల చర్యలు
మున్సిపాలిటీల్లో యాచకుల గుర్తింపు
వివరాలు సేకరిస్తున్న మెప్మా సిబ్బంది
భరోసా కల్పించేలా ప్రణాళికలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో భిక్షాటన చేసే వారిని గుర్తించేందుకు మెప్మా సిబ్బందితో సర్వే చేయిస్తున్నాం. ప్రభుత్వం భిక్షాటన చేసే వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
– సునీత, కమిషనర్, షాద్‌నగర్ మున్సిపాలిటీ
యాచన వీడేలా.. యాతన తీరేలా!


