‘ఉపాధి’కి ప్రణాళిక
వచ్చే నెలలో పూర్తి చేస్తాం
● గ్రామసభల్లో స్థానికుల సూచనల మేరకు పనుల గుర్తింపు
● కార్యాచరణ మొదలుపెట్టిన అధికారులు
దౌల్తాబాద్: ఉపాధి హామీ పథకం 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనుల గుర్తింపునకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏటా అక్టోబర్ 2వ తేదీ నుంచే ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల నియామవళితో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేనందున జిల్లా గ్రామాభివృద్ధి శాఖ సూచనల మేరకు క్షేత్రస్థాయి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ వారం నుంచే గ్రామసభలు ప్రారంభించి నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రామస్తుల ఆమోదంతోనే..
గ్రామాల వారీగా కూలీల సంఖ్యకు తగ్గట్లు పనులు గుర్తించాలి. అనంతరం గ్రామసభల్లో చర్చించి స్థానికుల అంగీకారం మేరకు పనులను ఆమోదిస్తారు. ఒక్కో పంచాయతీలో మూడు, నాలుగు పనులను ఎంపిక చేస్తారు. 2026 మార్చి 31 వరకు గతేడాది గ్రామసభల్లో ఆమోదించిన వాటినే చేపడతారు. ప్రస్తుతం ఆమోదించే పనులను 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నారు.
స్థానిక అవసరాలకు..
ఈ సారి ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పించారు. కూలీలను ఇందుకోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించే పనులను చేపట్టనున్నారు. జల సంరక్షణకు కట్ట కాల్వలు, కందకాల తవ్వకాలతో పాటు ఇంకుడు గుంతలు నిర్మాణం వంటి పనులను అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వనమహోత్సవంతో మొక్కలు నాటడం, నర్సరీలు, పండ్ల తోటల పెంపకం, పంట కల్లాల నిర్మాణాలు, పశువుల, మేకల షెడ్లు, వంటి పనులను ఎంపిక చేయనున్నారు. పథకంలోని 58 రకాల పనులను ఆయా గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యం కల్పిస్తారు.
మండలంలో ఉపాధి హామీ పథకం పనులకు ప్రణాళికలు తయారు చేస్తాం. ఇందుకోసం గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తాం. వచ్చే నెలలో గ్రామ సభలను పూర్తి చేసి ప్రణాళికలు తయారు చేసేలా చర్యలు చేపడుతున్నాం.
– అంజిలయ్య, ఏపీఓ, దౌల్తాబాద్


