నేడు, రేపు నగరంలో గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్
సాక్షి, సిటీబ్యూరో: క్రీడారాజధాని హైదరాబాద్ ఇప్పుడు గోల్ఫ్ హబ్‌గా మారుతోంది. గత కొంతకాలంగా పలు గోల్ఫ్ టోర్నీలకు ఆతిథ్యమిస్తున్న నగరం ఇప్పుడు అతిపెద్ద ఈవెంట్‌కు వేదికవుతోంది. ప్రతిష్టాత్మక గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ అండ్ ఎక్స్ పో– 2025 గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ వేదికగా జరగబోతోంది. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్(జీఐఏ) ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. టర్ఫ్ మేనేజ్ మెంట్ , రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ప్లేయర్స్ తో పాటు గోల్ఫ్ అసోసియేషన్ కు చెందిన ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఈ సమ్మిట్ ప్యానెల్ డిస్కషన్స్ లో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా గోల్ఫ్ ను మరింత ప్రమోట్ చేయడం, గోల్ఫ్ కోర్సుల నిర్మాణంతో పాటు యువ గోల్ఫర్లకు అత్యుత్తమ ట్రైనింగ్ , ఇతర అంశాలపై చర్చిస్తారు. అలాగే గోల్ఫ్ క్రీడతో టూరిజం అభివృద్ధికి కూడా పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈ రెండు రోజుల సమ్మిట్ ద్వారా గోల్ఫ్ కు హైదరాబాద్ లో మరింత ప్రోత్సాహం లభిస్తుందని జీఐఎ ఛైర్ పర్సన్ అనిరుధ చెప్పారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు. అలాగే ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ టూరిజంకు సైతం ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లో గోల్ఫ్ క్రీడకు ఆదరణ పెరగడం, మహిళా గోల్ఫర్లు సైతం ఈ క్రీడను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.


