
అభివృద్ధి వైపు అడుగులు
దుద్యాల్: రాష్ట్ర ప్రభుత్వం దుద్యాల్ మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే పశు వైద్య కళాశాలను మంజూరు చేసింది. కళాశాల భవన నిర్మాణం కోసం పశువైద్య అధికారులు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇటీవల మండల పరిధిలోని హకీంపేట్ శివారులో స్థల పరిశీలన సైతం చేశారు. పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరించిన 1,270 ఎకరాల భూమిలో 252 సర్వే నంబర్‌లో 250 ఎకరాలను ఎడ్యుకేషన్ హబ్ కోసం కేటాయించారు. అందులో పశువైద్య కళాశాల ఏర్పాటుకు దాదాపు 45 ఎకరాల భూమి అవసరమని భారత పశువైద్య మండలి అధికారులు సూచించినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.360 కోట్లను కేటాయించిందని, మొదటి విడతలో రూ.200 కోట్లను మంజూరు చేసినట్లు సమాచారం.
హకీంపేట్‌లో 45 ఎకరాలు కేటాయింపు
దుద్యాల్ మండల ఏర్పాటు తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతుంది. మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంట తండా గ్రామాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వం దాదాపు 1,270 ఎకరాల భూమిని సేకరించింది. త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మండల కేంద్రంలో ఽసమీకృత మండల కార్యాలయాలు, ధాన్యం నిల్వల కోసం గోదాం ఏర్పాటు, హకీంపేట్లో మండల సమీకృత విద్యాలయాలు, ఏటీసీ సెంటర్, ఇంటర్ కళాశాల వంటివి కేటాయించారు. అందుకు సంబంధించిన పనుల సైతం వేగంగా జరుగుతున్నాయి. తాజాగా పశువైద్య కళాశాలను కేటాయించడంతో మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పశువైద్య కళాశాలకు స్థల పరిశీలన
సందర్శించిన భారత పశువైద్య మండలి అధికారులు
హర్షం వ్యక్తం చేస్తున్న దుద్యాల్‌వాసులు