
పండగ పూట.. భద్రం సుమా!
● టపాసులు కాల్చేటప్పుడుజాగ్రత్తలు తప్పనిసరి
● వ్యాధిగ్రస్తులు దూరంగాఉండడం మంచిది
దుద్యాల్: దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో సందడి మామూలుగా ఉండదు. చిన్నపిల్లలు ఉంటే మరీ ఎక్కువే ఉంటుంది. ఉదయం నుంచి లక్ష్మీ పూజలు చేసుకోవడం, సాయంత్రం బాణసంచా కాల్చడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే టపాసులతో పర్యావరణానికి విఘాతం కలిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు బాణసంచా కాల్చేటప్పడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
కాలుష్య ప్రభావం
బాణసంచా కాల్చడంతో వాటి నుంచి వెలువడే పొగ వాతావరణంలో సుమారు మూడు రోజుల వరకు ఉంటుంది. అలాంటి గాలిని పీల్చినప్పుడు శ్వాసకోస వ్యాధులు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. టపాకాయల్లో ఉండే టాక్సిక్ అనే కారకంతో పాటు రాగి, కాడ్మియం, పోటాషియం వంటి పదార్థాలు విఘాతం కలిగిస్తాయి. వీటితో ఆస్తమాతో పాటు ఇతర రుగ్మతలు వస్తాయి. టపాసులు కాల్చేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కళ్లకు ముప్పు తప్పదని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు. 70–80 శాతం ప్రమాదాల్లో 10–18 సంవత్సరాల వారే ఉంటున్నారు. జాగ్రత్తలు పాటించడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవి పాటించాలి
● టపాసులు కాల్చేటప్పుడే కాటన్ దుస్తులే ధరించాలి.
● చిన్న పిల్లలు పెద్దల సమక్షంలోనే కాల్చాలి.
● సగం కాల్చిన, కాలని టపాసులను నీళ్లు, ఇసుకలో వేయాలి.
● రాకెట్స్ ఇతర టపాసులను గుడిసెలు, పెట్రోల్ బంకుల వద్ద కాల్చకూడదు.
● టపాసులు కాల్చుతున్న ప్రదేశంలో నీరును అందుబాటులో ఉంచుకోవాలి.
● వాయువులు కళ్లలోకి వెళ్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే కంటి వైద్యులను సంప్రదించాలి.
● టపాసులు కాల్చుతున్నప్పుడు శబ్దాలకు చెవిలో దూది పెట్టుకోవడం మేలు.
● ఆస్తమా, అలర్జీలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. దురద, తుమ్ములు, ఆయాసం పెరుగుతాయి. ఇవి రాకుండా ముక్కు దగ్గర తడి వస్త్రం కట్టుకోవాలి.
● కళ్లకు అద్దాలు పెట్టుకుంటే ఎలాంటి హాని జరుగదు.
శబ్దంతో ప్రమాదం
టపాసులను పేల్చడం ప్రమాకరమే. మానవుడు సాధారణంగా 120 డేసిబెల్స్ వరకు శబ్దం వినవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే చెవిలో నొప్పి ప్రారంభమై రక్తం కారుతుంది. చెవిలో దుది పెట్టుకొని బాణసంచా కాల్చాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదు.
– వందన, వైద్యురాలు, పీహెచ్‌సీ హకీంపేట్

పండగ పూట.. భద్రం సుమా!