
ఆనంద రవళి దీపావళి
ధనలక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలతో సందడి
● కొనుగోలు దారులతో బాణసంచా,పూజాసామగ్రి దుకాణాల కిటకిట
పరిగి: దీపావళి పర్వదినానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చీకటిని పారదోలుతూ వెలుగును తెచ్చేపండుగా, విజయానికి ప్రతీకగా జరుపుకొంటారు. చెడుపై గెలుపునకు సంకేతంగా ఇంటిల్లిపాది.. ధనలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ.. కాంతులు వెలిగిస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాలి అనికూడా పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లు, దుకాణాల్లో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి సంపద, అదృష్టం, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చుతూ ఆనందోత్సహాలతో కేరింతలు కొడతారు.
పర్యావరణ పరిరక్షణ
పండుగ వేళ, పర్యావరణ పరిరక్షణకు టపాకాయలు వాయు, ధ్వని కాలుష్యాన్ని పెంచేవిధంగా ఉన్నాయనే కోణంలో కొన్నిటిని నిషేధించారు. బాణసంచా కాల్చినప్పుడు సాధారణం కంటే కాలుష్యం కొన్ని వందల రేట్లు అధికంగా విడుదలవుతుంది. వీటిని కాల్చేవారికి కాకుండా చుట్టూ ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు. పొగ ఎక్కువ వ్యాపించి, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తూ.. టపాసులను కాల్చాలని సూచిస్తున్నారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం కాలుష్య నివారణకు ఆంక్షలు విధించింది. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో టపాసులను నిషేధించింది. సాధారణ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది.
ప్రమాదాల నివారణకు..
టపాసులు కాల్చే ముందు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దుస్తులపై నిప్పురవ్వలు పడితే త్వరగా ప్రభావం చూపకుండా కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను గమనిస్తుండాలి. బాణసంచా పేల్చేటప్పుడు చెవుల్లో దూది పెట్టుకోవడం మరిచిపోవద్దు. సీమ టపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వ తరహా టపాసులు ఇవ్వవద్దు. రాకెట్‌లాంటివి పూరిళ్లకు దూరంగా విశాలమైన ఆవరణలోనే కాల్చాలి. కాలని వాటిని నీటిలో లేదా ఇసుక బకెట్‌లో వేయాలి. భూచక్రాలు కాల్చేటప్పుడు పాదరక్షలు ధరించడం మంచిది. సామగ్రికి సమీపంలో కొవ్వత్తులు ఉంచరాదు.