పేకాట స్థావరంపై పోలీసుల దాడి | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Oct 20 2025 9:35 AM | Updated on Oct 20 2025 9:35 AM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ధారూరు: మండల పరిధి అంతారం గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడిచేశారు. జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.6,340 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని, నిందితులను ఠాణాకు తరలించారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ అన్వర్‌పాష, సిబ్బంది పాల్గొన్నారని ధారూరు ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు.

విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

చేవెళ్ల: వాహనంలో కొత్తిమిర లోడ్‌ చేసి, కవర్‌ కప్పుతుండగా.. పైన ఉన్న విద్యుత్‌ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బస్తేపూర్‌ గ్రామంలో చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా పులుసు మామిడి గ్రామానికి చెందిన మహమ్మద్‌ జహంగీర్‌(26), చేవెళ్లలో బోలెరో డ్రైవర్‌ జహంగీర్‌ వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటీ లాగే శనివారం రాత్రి బస్తేపూర్‌లో కొత్తిమీర లోడ్‌ కోసం వెళ్లారు. పొలం సమీపంలోని విద్యుత్‌ తీగల కింద వాహనం ఆపారు. లోడ్‌ అనంతరం వాహనం పైకి ఎక్కి.. కవర్‌ కప్పుతున్న క్రమంలో పైన ఉన్న కరెంట్‌ తీగలు చేతికి తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే డ్రైవర్‌.. బాధితున్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి యూసుప్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

26న పాషనరహరి వర్ధంతి సభ

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో ఈ నెల 26న నిర్వహించే కామ్రెడ్స్‌ మహబూబ్‌ పాష, నరహరి వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపునిచ్చారు. సీపీఎం కమిటీ జిల్లా ముఖ్యనేతల సమావేశం ఆదివారంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూములను పేదలకు పంచాలని, కూలీ రేట్లు పెంచాలని, అణగారిన వర్గాల అభ్యన్నతికి, వారి హక్కుల కోసం పోరాడిన పాషనరహరిలను హతమార్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాంచందర్‌, సామేల్‌, చంద్రమోహన్‌, జగన్‌, నర్సింహ్మ, బుగ్గరాములు, జంగయ్య, అంజయ్య, రుద్రకుమార్‌లు పాల్గొన్నారు.

గ్లూకోజ్‌ కారణంగానే చనిపోయింది..

ఎమ్మెల్యే మల్‌రెడ్డికి వివరించిన మానస కుటుంబీకులు

మంచాల: గ్లూకోజ్‌ కారణంగానే గర్భిణి మానస చనిపోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. వైద్య చికిత్స కోసం శుక్రవారం భర్త మధుతో కలిసి మానస స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు రాగా.. ఆమెకు గ్లూకోజ్‌ ఎక్కిస్తున్న క్రమంలో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే విషయమై న్యాయం కోసం.. బాధిత కుటుంబం ఆదివారం నగరంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిశారు. వైద్యల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని, మృతురాలికి చిన్నబాబు ఉన్నాడని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీనిచ్చారు. కలెక్టర్‌, ఆర్డీఓతో మాట్లాడి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, భర్త మధుకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, బాలుడి చదువుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సదానందం, ప్రవీణ్‌, బూర కృష్ణ, విష్ణు వర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం

ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

అబ్దుల్లాపూర్‌మెట్‌: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్నూర్‌ గ్రామానికి చెందిన చిత్తలూరి వెంకన్న కుమారుడు చిత్తలూరి గణేశ్‌(23), నాలుగు నెలలుగా ఎల్బీనగర్‌లోని దుర్గా ఫైర్‌ వర్క్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాణసంచా లోడ్‌ను శనివారం రాత్రి ఘట్‌కేసర్‌లో అన్‌లోడ్‌ చేశారు. అనంతరం మహేశ్వరం నుంచి గోదాం వద్ద ఔటర్‌రింగ్‌ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఆదివారం తెల్లవారు జామున ఎగ్జిట్‌ నం.10 వద్ద, ఎలాంటి సిగ్నల్‌ లేకుండా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న డీసీఎం డీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సందీప్‌, సతీష్‌లు గాయాపడ్డారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement