
నిధులు రాక.. నిర్మాణం సాగక
● అసంపూర్తిగా గిరిజన భవనం
● పట్టించుకోని పాలకులు, అధికార యంత్రాంగం
ఆమనగల్లు: గిరిజనుల కోరిక మేరకు.. సంయుక్తంగా సభలు, సమావేశాలు, పండుగలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గిరిజన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు కావాల్సిన నిధులు కేటాయించింది. అనంతరం నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ.. అవి నిలిచిపోయాయి.
30 గుంటల భూమి
గిరిజన సంఘాల విన్నపంతో 2023లో కల్వకుర్తి నాటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో గిరిజన భవన నిర్మాణానికి 30 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అక్కడ గిరిజనులు సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం రూ.2 కోట్లు మంజూరు చేయించారు. దీంతో అదే ఏడాది జూన్ 17న అప్పటి కలెక్టర్ హరీశ్‌తో కలిసి.. జైపాల్ యాదవ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే నిధులు కేటాయించినప్పటికీ.. టెండర్ ప్రక్రియ చేపట్టకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.
2024లో పనులు షురూ
ప్రస్తుత ప్రభుత్వం 2024లో భవన నిర్మాణ పనులకు కదలిక తెచ్చింది. టెండర్ ప్రక్రియ నిర్వహించి, పనులు ప్రారంభించింది. ఇప్పటి వరకు షెడ్డు, చుట్టూ ప్రహరి పూర్తయింది. ఇంకా సగం పనులు చేపట్టాల్సి ఉంది. అయితే బిల్లులు రాలేదంటూ.. సదరు నిర్మాణదారుడు పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లతో పనులు పూర్తయ్యాయి.