
కడ్తాల్ తహసీల్దార్‌గా జయశ్రీ
కడ్తాల్: నూతన తహసీల్దార్‌గా జయశ్రీ ని యామకమయ్యారు. ఈ మేరకు కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కడ్తాల్‌లో రెండేళ్లుగా పనిచేసిన షేక్ ముంతాజ్.. డీఎఓగా చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సైదాబాద్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న జయశ్రీ ఇక్కడికి వచ్చారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
కుల్కచర్ల: ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటయ్య(42), శనివారం కుల్కచర్ల గ్రామంలో ఓ వేడుకకు హాజరై.. రాత్రి పది గంటలకు గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. అతను నడిపిస్తున్న టీవీఎస్ ఎక్సెల్.. రైతువేదిక సమీపంలో అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న రాళ్లు సదరు వ్యక్తికి బలంగా తాకి, తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం వరకు అతన్ని ఎవరూ చూడకపోవడంతో తీవ్రరక్తస్రావం జరిగి మృత్యువాత పడ్డాడు. దీనిని గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు.. కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతుడి భార్య చెన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బైక్ ఢీ కొని మరొకరు..
షాద్‌నగర్‌రూరల్: ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పోచమ్మ దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ప్యారడైజ్ కాలనీ వాసి జెట్టిరమణయ్య(45), శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి ఓ బైక్.. రమణయ్యను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడు పరారీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

కడ్తాల్ తహసీల్దార్‌గా జయశ్రీ