
పర్యవేక్షణ లేక.. అధ్వాన స్థితి
దౌల్తాబాద్: రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో చెరువులు అధ్వానంగా మారాయి. మరోవైపు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసినా వాటిపై అజమాయిషీ లేక నీటి వనరులపై దృష్టి పెట్టేవారు కరువయ్యారు. ఒకప్పుడు చెరువుల అభివృద్ధి నిర్వహణ, ఆయకట్టు నీటి విడుదల పర్యవేక్షణ పనులను నీటి సంఘాల పాలక వర్గాలు చేపట్టేవి. పదిహేడేళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ పర్యవేక్షణ కరువైంది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పనులు చేపట్టకముందే నిధులు కాజేశారన్న ఆరోపణలు వచ్చాయి.
శిథిలావస్థకు తూములు
గత ప్రభుత్వాలు 100 ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేవి. ఈ ఎన్నికల్లో రైతులు నీటి సంఘం చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో సాగు నీటిని పంట పొలాలకు విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు సైతం చేపట్టేవారు. గత 17 ఏళ్ల నుంచి నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ అధ్వానంగా మారింది. కొన్ని చెరువుల తూములు, పంట కాల్వలు, అలుగులు శిథిలావస్థకు చేరుకున్నాయి. తూములు పనిచేయక సాగు నీరురాక నిరుపయోగంగా మారాయి. చెరువులపై ఎవరి పెత్తనం లేకపోవడంతో రైతులకు సాగు నీరు అవసరమయ్యే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభంలో చేపలు పట్టుకోవడం కోసం రాత్రికి రాత్రి చెరువుల నుంచి నీటిని అక్రమంగా ఖాళీ చేస్తున్నారు.
2008లో చివరిసారి
2006వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వంద ఎకరాల ఆయకట్టుకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు రెండు సంవత్సరాల కాలానికి గాను సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటి నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చెరువులను మరింత అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.
రూపురేఖలు కోల్పోతున్న చెరువులు, కుంటలు
పదిహేడేళ్లుగా నీటి సంఘాలకు ఎన్నికలు బంద్
పట్టించుకోని ప్రభుత్వాలు
సంఘాలతోనే అభివృద్ధి
నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకుంటేనే చెరువులు అభివృధ్ది చెందుతాయి. గతంలో నీటి సంఘాల పాలకవర్గాలు ఉండడం వలన నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా వాటి పర్యవేక్షణ కూడా పకడ్బంధీగా ఉండేది. ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించాలి. – వెంకటయ్య, రైతు, దేవర్‌ఫసల్‌వాద్

పర్యవేక్షణ లేక.. అధ్వాన స్థితి