
రోడ్డు ధ్వంసంపై పరస్పర ఫిర్యాదులు
పూడూరు: మాజీ సర్పంచ్ కుటుంబంతో తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు బిక్యానాయక్, ప్రభాత్, జంగయ్య తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం మన్నెగూడలో విలేకరులతో మాట్లాడారు. రాకంచర్ల నుంచి పొలాలకు వెళ్లకుండా మాజీ సర్పంచ్ పెంటయ్య, అతని సోదరుడు రాజు రోడ్డుకు అడ్డంగా జేసీబీతో గుంతలు తీయించారన్నారు. ఈ మార్గం వ్యవసాయ పొలాలతో పాటు సిరిగాయిపల్లికి వెళ్తుందని తెలిపారు. రోడ్డును ధ్వంసం చేయడాన్ని ప్రశ్నించిన కారణంగా తన కొడుకుపై దాడి చేశారని రైతు జంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం వద్ద విచారణకు వచ్చి చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డి ఎదుటే బూతు మాటలు తిడుతూ, దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఐని వివరణ కోరగా ఇరువర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.